భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

విద్యార్థులకు గూగుల్ ఏఐ సేవలపై కొత్త నిబంధనలు..

విద్యార్థులకు గూగుల్ ఏఐ సేవలపై కొత్త నిబంధనలు..

భార‌త్ స‌మాచార్, విద్య‌ : పాఠశాల విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనాలను ఉపయోగించే విషయంలో టెక్ దిగ్గజం గూగుల్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై పాఠశాల స్థాయి విద్యార్థుల ఖాతాల్లో గూగుల్ జెమిని, జెమిని నోట్‌బుక్, జెమిని ఇన్ క్లాస్‌రూమ్, గూగుల్ సెర్చ్ వంటి సేవలు డిఫాల్ట్‌గా అందుబాటులో ఉండవు. పాఠశాల యాజమాన్యం లేదా అడ్మినిస్ట్రేటర్లు అనుమతించిన తర్వాతే వాటిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త విధానం K-12 విద్యార్థుల ఖాతాలకు వర్తించనుంది.

గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్ విభాగం ఉపాధ్యక్షుడు క్రిస్ ఫిలిప్స్ నవంబర్ 3న అధికారిక బ్లాగ్ ద్వారా ఈ మార్పులను ప్రకటించారు. పాఠశాలలు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, విధాన రూపకర్తల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తరగతి గదుల్లో ఏఐ వినియోగంపై మరింత నియంత్రణ పాఠశాలలకు కల్పించడమే లక్ష్యమని వివరించారు. విద్యార్థుల వయసు, తరగతి, విద్యా అవసరాలను బట్టి ఏ సేవలను అందుబాటులో ఉంచాలనేది పాఠశాలలే నిర్ణయించుకోవచ్చు.

ఈ మార్పుల్లో గూగుల్ సెర్చ్‌కు సంబంధించిన అంశం ఆసక్తికరంగా మారింది. సెర్చ్ సేవలో ఏఐ ఓవర్‌వ్యూస్, ఏఐ మోడ్ వంటి ఫీచర్లు అంతర్భాగంగా మారడంతో వాటిని పూర్తిగా తొలగించి సంప్రదాయ సెర్చ్‌ను మాత్రమే అందించే అవకాశం ఉండదని సంస్థ స్పష్టం చేసింది. అయితే గూగుల్ వివరణ ప్రకారం, జెమిని వంటి ప్రత్యేక ఏఐ సేవలను నిలిపివేసి సెర్చ్‌ను విడిగా అనుమతించే అవకాశం ఉంది. ఏఐతో పాటు సెర్చ్‌ను కూడా నిలిపివేస్తే విద్యార్థులకు ఆ సేవ అందుబాటులో ఉండదు. ఈ మార్పుల అమలుకు సంబంధించిన పూర్తి వివరాలను పాఠశాలలకు త్వరలో వెల్లడించనుంది.

మరోవైపు విద్యార్థులు ఏఐపై అతిగా ఆధారపడితే స్వతంత్రంగా ఆలోచించడం, సమస్యలను పరిష్కరించడం వంటి నైపుణ్యాలపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు విద్యావర్గాల్లో ఉన్నాయి. హోంవర్క్, అసైన్‌మెంట్లకు ఏఐ ఇచ్చే సమాధానాలను నేరుగా ఉపయోగించడం వల్ల నేర్చుకునే ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ సెర్చ్‌లోనూ సమాధానాలను నేరుగా ఇవ్వకుండా, విద్యార్థులు దశలవారీగా సమస్యను అర్థం చేసుకునేలా గైడెడ్ లెర్నింగ్ ఫీచర్లను తీసుకొస్తోంది. మరి ఈ కొత్త విధానం విద్యార్థుల అభ్యాసానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.