భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

పొలం గట్లపైకి వెళ్లి రైతుల కష్టాలు తెలుసుకున్న చంద్రబాబు..

పొలం గట్లపైకి వెళ్లి రైతుల కష్టాలు తెలుసుకున్న చంద్రబాబు..

భార‌త్ స‌మాచార్, అమ‌రావ‌తి : తుపాను సమీక్షలకే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు. వరుస తుపాన్లతో పంటలు నీట మునిగి తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు అండగా నిలిచేందుకు స్వయంగా పొలాల్లోకి వెళ్లారు. బురదమయమైన రహదారులు, నీటితో నిండిన పంట పొలాలను పరిశీలిస్తూ రైతుల నుంచి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు.

అర్నబ్, మురసు తుపానుల హెచ్చరికలు వచ్చినప్పటి నుంచే ముఖ్యమంత్రి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, వరద ముప్పు, ప్రజల తరలింపు, సహాయక చర్యలపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. విద్యుత్, తాగునీరు, రహదారుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరిపి తుపాను బాధితులకు అవసరమైన సహాయం అందించాలని కోరారు.

అర్నబ్ తుపాను సమయంలో కోనసీమ జిల్లాలోని కాట్రేనికోనతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు, నరసాపురం ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. తాజాగా మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో భాగంగా బాపట్ల జిల్లాలోని జిల్లెల్లమూడి, గుంటూరు జిల్లాలోని రేటూరును సందర్శించారు. జిల్లెల్లమూడి వద్ద దెబ్బతిన్న డ్రెయిన్లను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. రేటూరులో నీట మునిగిన వరి పొలాల్లోకి వెళ్లి పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించారు.

రైతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి సాగు కోసం ఎంత పెట్టుబడి పెట్టారు? ఎన్ని ఎకరాల్లో పంట దెబ్బతింది? పంటల బీమా చేయించుకున్నారా? వంటి వివరాలు తెలుసుకున్నారు. పంట చేతికొచ్చే సమయంలో నష్టం జరగడం బాధాకరమని పేర్కొంటూ, పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ ద్వారా బాధితులకు సహాయం అందిస్తామని తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.