భారత్ సమాచార్, జాతీయం : దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. బహిరంగ మార్కెట్లో బియ్యం సరఫరాను పెంచి ధరలను నియంత్రించేందుకు ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (OMSS-D) కింద విక్రయాల లక్ష్యాన్ని రెట్టింపు చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకు 25 లక్షల టన్నులుగా ఉన్న లక్ష్యాన్ని 50 లక్షల టన్నులకు పెంచింది. అక్టోబర్ 31 నాటికే ఈ-వేలం ద్వారా ప్రైవేట్ కొనుగోలుదారులకు 25 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించినట్లు కేంద్రం వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయానికి 11 లక్షల టన్నుల బియ్యం మాత్రమే విక్రయమైంది.
మరోవైపు, బియ్యం, ధాన్యం నిల్వలపై కేంద్రం పర్యవేక్షణను కఠినతరం చేసింది. దేశవ్యాప్తంగా వ్యాపారులు, హోల్‌సేలర్లు, రిటైలర్లు, బిగ్చైన్ రిటైలర్లు, ప్రాసెసర్లు, మిల్లర్లు తమ నిల్వల వివరాలను తప్పనిసరిగా ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. బాస్మతి, నాన్ బాస్మతి, పార్బాయిల్డ్, బ్రోకెన్ రైస్‌తో పాటు ధాన్యం నిల్వల వివరాలను ప్రతి శుక్రవారం అప్డేట్ చేయాలి. తప్పుడు సమాచారం ఇచ్చినా, నమోదు చేసుకోకపోయినా లేదా నిర్ణయించిన నిల్వ పరిమితులను ఉల్లంఘించినా అత్యవసర వస్తువుల చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
దక్షిణాది రాష్ట్రాల్లో బియ్యం లభ్యతను పెంచేందుకు కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ సంస్థలకు అదనంగా భారత్ రైస్ కేటాయించనుంది. వీటి ద్వారా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో బియ్యం సరఫరాను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా, ఈ ఐదు రాష్ట్రాలు అవసరాన్ని బట్టి బియ్యం, ధాన్యం నిల్వలపై పరిమితులు విధించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి 2027 జనవరి 31 వరకు అమల్లో ఉంటుంది.
ఈ చర్యలతో మార్కెట్లో బియ్యం సరఫరా పెరిగి ధరలు కొంతవరకు తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది. అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశం. అయితే, నిల్వల పరిమితులను కేంద్రం నేరుగా అన్ని రాష్ట్రాల్లో విధించలేదు. అవసరాన్ని బట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నియంత్రణ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. ఈ చర్యలు వినియోగదారులకు సరసమైన ధరలకు బియ్యం అందించడంలో ఎంతవరకు ప్రభావం చూపుతాయో చూడాలి.