భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రసాయన ఎరువులు, పెస్టిసైడ్స్ వినియోగాన్ని తగ్గించి ప్రకృతి సిద్ధమైన పద్ధతులతో పంటలు సాగు చేయడంపై రైతులకు అవగాహన కల్పించారు. వేసంగి (రబీ) సీజన్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టే సమయంలో పాటించాల్సిన మెలకువలు, యాజమాన్య పద్ధతులపై మండల వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని ఆలేరు రైతు వేదికలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ప్రకృతి వ్యవసాయ సాగుకు ఎంపికైన మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన 125 మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహజ సాగులో అనుసరించాల్సిన పద్ధతులు, పంటల యాజమాన్యం, సాగు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ రైతులకు వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు రైతులు సరైన పద్ధతులను పాటించాలని సూచించారు.
ప్రకృతి వ్యవసాయం చేపట్టే రైతులు పెస్టిసైడ్స్, రసాయన ఎరువుల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని మహేందర్ సూచించారు. వాటికి బదులుగా పశువుల పేడ, ఆవు మూత్రం, వేప గింజలు వంటి ప్రకృతిలో లభించే సహజ వనరులను వినియోగించాలని తెలిపారు. పర్యావరణానికి హాని కలగకుండా, నేల సహజ లక్షణాలు దెబ్బతినకుండా సాగు చేయడం ద్వారా వ్యవసాయాన్ని మరింత ఆరోగ్యకరంగా కొనసాగించవచ్చని వివరించారు.
ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులతో పండించిన పంటలు ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. రైతులు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకొని, రబీ సీజన్ నుంచే సహజ సాగు పద్ధతులను అమలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి మణికంఠ, CRPలు జాటోత్ రమేష్, శామకూరి సునీతతో పాటు ఆర్గానిక్ సాగు చేస్తున్న రైతులు పాల్గొన్నారు.