భారత్ సమాచార్, విద్య : ఐఐటీ-జేఈఈ, నీట్, సీయూఈటీ, ఐపీమ్యాట్, సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఖరీదైన కోచింగ్, ఎక్కువ సంఖ్యలో రిఫరెన్స్ పుస్తకాలే విజయానికి మార్గమని భావిస్తుంటారు. కానీ ఏ పరీక్షకైనా ముందుగా సబ్జెక్టుపై ప్రాథమిక అవగాహన, బలమైన పునాది అవసరం. ఈ విషయంలో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయి. పాఠ్యాంశాలను సరళమైన భాషలో వివరించడం, ముఖ్యమైన నిర్వచనాలు, ఉదాహరణలు, చిత్రాలు అందించడం వీటి ప్రత్యేకత. అందుకే పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లో వీటిని ప్రాథమిక అధ్యయన వనరులుగా ఉపయోగించుకోవచ్చు.
విద్యార్థులు వీలైనంత ముందుగానే తమ తరగతులకు సంబంధించిన ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదివే అలవాటు చేసుకోవాలి. ప్రతి పాఠాన్ని అర్థం చేసుకుంటూ ముఖ్యమైన అంశాలు, నిర్వచనాలు, కొత్త పదాలను నోట్ చేసుకోవాలి. అవసరమైన చోట డయాగ్రమ్స్, పట్టికలు, షార్ట్ నోట్స్ తయారు చేసుకోవడం ఉపయోగకరం. జేఈఈ, నీట్ వంటి పరీక్షల్లో ఫిజిక్స్ కాన్సెప్టులకు పునాది ఏర్పడటంతో పాటు, కెమిస్ట్రీలో ముఖ్యంగా ఇనార్గానిక్ అంశాలు, బయాలజీలో నిర్వచనాలు, ప్రక్రియలు, చిత్రాలను అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకాలు తోడ్పడతాయి. అయితే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ వంటి విభాగాల్లో అదనపు సమస్యల సాధన కూడా తప్పనిసరి.
సివిల్స్ అభ్యర్థులకు 6 నుంచి 12వ తరగతి వరకు ఉన్న ఎన్‌సీఈఆర్‌టీ చరిత్ర, భూగోళశాస్త్రం, ఆర్థికశాస్త్రం, రాజ్యాంగం, సైన్స్ పుస్తకాలు ప్రాథమిక అవగాహన కల్పిస్తాయి. సీయూఈటీ, ఐపీమ్యాట్, క్లాట్ వంటి పరీక్షలకు కూడా సంబంధిత సబ్జెక్టుల ప్రాథమిక పరిజ్ఞానం, చదివి అర్థం చేసుకునే సామర్థ్యం పెంపొందించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. అయితే ప్రతి పరీక్ష ప్రశ్నలు పూర్తిగా ఎన్‌సీఈఆర్‌టీ నుంచే వస్తాయని భావించకూడదు. ఆయా పరీక్షల అధికారిక సిలబస్ ప్రకారం ప్రిపరేషన్ కొనసాగించాలి.
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల అధ్యయనం పూర్తయ్యాక ప్రీవియస్ ఇయర్ ప్రశ్నపత్రాలు, వర్క్‌బుక్స్, మాక్ టెస్టులపై దృష్టి పెట్టాలి. పరీక్షలో ఎదురైన తప్పులను విశ్లేషించి, కాన్సెప్టుల పరంగా ఎక్కడ లోపం ఉందో గుర్తించాలి. సమయపాలన, ప్రశ్నలను అర్థం చేసుకోవడం, సమాధానాలను వేగంగా గుర్తించడం వంటి నైపుణ్యాలను సాధనతో మెరుగుపరుచుకోవాలి. అవసరమైనప్పుడు మాత్రమే అదనపు రిఫరెన్స్ పుస్తకాలను ఎంచుకోవాలి. ఎక్కువ పుస్తకాలు సేకరించడం కంటే, ప్రామాణిక పుస్తకాలను పదేపదే చదివి వాటిలోని అంశాలను ప్రశ్నలకు అన్వయించడం విజయానికి మెరుగైన మార్గం.