భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, నవంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

భూమి పట్టా కోసం నిరుపేద రైతుల నిరాహార దీక్ష

భూమి పట్టా కోసం నిరుపేద రైతుల నిరాహార దీక్ష

భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: తమకు న్యాయంగా దక్కాల్సిన భూమికి పట్టా వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని ధర్మన్నగూడ గ్రామానికి చెందిన నిరుపేద రైతులు తేరటి పుణ్యాలు, నిర్మల స్పష్టం చేశారు. తమ కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యాచారం మండలం ధర్మన్నగూడ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షకు గ్రామస్తులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీక్ష ప్రారంభానికి ముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. సుమారు 40 ఏళ్ల క్రితమే భూమికి సంబంధించిన డబ్బులు చెల్లించామని, అగ్రిమెంట్ కూడా రాసుకున్నామని తెలిపారు. డాక్యుమెంట్ నంబర్ 1277/1992 ప్రకారం తమకు పట్టా చేస్తానని నమ్మించి, ఇన్నేళ్లుగా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో ఇచ్చిన హామీని ఇప్పుడు నిలబెట్టుకోకుండా మాట మారుస్తున్నారని ఆరోపించారు.

భూమి పట్టా కోసం నిరుపేద రైతుల నిరాహార దీక్ష

అంతేకాకుండా తమకు చెందాల్సిన భూమిని తన కుమారుడు ఆకుల శ్రీనివాస్ పేరుతో రహస్యంగా GPA చేయించుకుని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. దశాబ్దాలుగా భూమి పట్టా కోసం ఎదురుచూస్తున్న తమకు ఇప్పటికీ న్యాయం జరగకపోవడం బాధాకరమన్నారు. తమ భూమిని తమ పేరుపై పట్టా చేసే వరకు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తామని తేరటి పుణ్యాలు, నిర్మల తేల్చిచెప్పారు.

బాధిత రైతులకు మద్దతుగా నిలిచిన గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. భూమికి సంబంధించి ఒప్పందం జరిగిన సమయంలో తాము ప్రత్యక్షంగా ఉన్నామని, ఒప్పంద పత్రంపై తమ సంతకాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు ఒప్పందాన్ని విస్మరించి బాధితులకు అన్యాయం చేయడం సరికాదని అన్నారు. ఆకుల కోటయ్య వెంటనే స్పందించి బాధిత రైతులకు భూమిని పట్టా చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ మద్దతు కొనసాగుతుందని భరోసా ఇచ్చారు.

భూమి పట్టా కోసం నిరుపేద రైతుల నిరాహార దీక్ష

ముందుగా ప్రస్తుత వార్డు సభ్యురాలు మండల ప్రేమలత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, బాధితుల రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు చిన్నపిల్లలతో సహా పాల్గొన్నారు. గ్రామ మాజీ సర్పంచ్ మండల భాషయ్య, మండల బాలరాజ్, మండల చిన్న సత్తయ్య, చింతపట్ల రాములు, నాగటి సత్తయ్య, బండ మల్లేశ, పుప్పాల శాంతి, అనుమాండ్ల జంగయ్య, అనుమాండ్ల శ్రీనివాస్, నాగటి నవీన్, చీమల జంగయ్య, పెద్దోళ్ల నర్సింహా, గౌర శ్రీశైలం, మండల గోపాల్, బుర్రి నరేష్, మండల కృష్ణ, గౌర శ్రీనివాస్, అనుమాండ్ల యాదగిరి, ముక్కెర మధుతో పాటు యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.