భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దీపాల వెలుగులు.. బాణసంచా సందళ్లు.. ప్రత్యేక పూజలతో రామాయంపేటలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగను పురస్కరించుకుని మండల కేంద్రంలో ఉదయం నుంచే సందడి నెలకొంది. ప్రజలు తమ ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీపావళి వేడుకలను భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు.
సాయంత్రం అమావాస్య సందర్భంగా పట్టణంలోని వివిధ వ్యాపార సంస్థల్లో వ్యాపారులు ధనలక్ష్మి పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, సుఖసంతోషాలు వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించారు. పూజల అనంతరం టపాసులు కాలుస్తూ, బాణసంచా వెలుగుల మధ్య పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.
మరోవైపు పట్టణంలోని పలు షాపులను సందర్శించిన మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ వ్యాపారులు, ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి వేడుకలతో రామాయంపేట పట్టణమంతా దీపాల కాంతులతో కళకళలాడింది.