భారత్ సమాచార్ మహబూబాబాద్ జిల్లా : రోడ్డు ప్రమాదంలో బ్రాహ్మణ కొత్తపల్లికి చెందిన కోళ్ల సోమయ్య (55) అకాల మరణం చెందడం బాధాకరమని ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ అన్నారు. ఆదివారం జరిగిన ప్రమాదంలో సోమయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోమవారం నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లికి చేరుకున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎదలళ్ల యాదవ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు హెచ్. వెంకటేశ్వర్లుతో కలిసి సోమయ్య భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సోమయ్య ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని విచారం వ్యక్తం చేశారు. కుటుంబానికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయలేకపోయినా, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
మరోవైపు బ్రాహ్మణ కొత్తపల్లి సర్పంచి, బీఆర్ఎస్ యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు యాకాంతం గౌడ్ కూడా సోమయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లు మురళీకృష్ణ యాదవ్‌తో కలిసి పార్థివదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కష్ట సమయంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు పెరుమాండ్ల రాజు గౌడ్, పిట్టల మురళి, రావుల సతీష్, మల్లేశం గౌడ్ తదితరులు ఉన్నారు. అలాగే సర్పంచి యాకాంతం గౌడ్ వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సోమయ్యకు నివాళులర్పించారు. గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందడంతో బ్రాహ్మణ కొత్తపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.