భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

బోరుబావుల రంగాన్ని సంక్షోభం నుంచి కాపాడాలి

బోరుబావుల రంగాన్ని సంక్షోభం నుంచి కాపాడాలి

భారత్ సమాచార్, హైదరాబాద్ జిల్లా: బోరుబావుల తవ్వకాల రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ప్రభుత్వం జారీ చేసిన GO నంబర్ 259ను వెంటనే సవరించి ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు, డ్రైవర్లు, వ్యాపారుల ఉపాధిని కాపాడాలని తెలంగాణ రిగ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఆచరణ సాధ్యమైన నిబంధనలు రూపొందించి బోరుబావుల రంగాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు ముస్కు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జి. నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

సోమవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు. బోరుబావుల తవ్వకాలపై ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా ఈ రంగంపై ఆధారపడి పనిచేస్తున్న రిగ్ కార్మికులు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి జీవనం సాగిస్తున్న డ్రైవర్లు, వాల్వ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నిర్మాణ రంగంపై ఆధారపడిన మేసన్ల ఉపాధిపైనా ఈ నిబంధనల ప్రభావం పడుతోందని తెలిపారు. బోరుబావుల తవ్వకాల రంగం స్తంభిస్తే దాని ప్రభావం అనుబంధ రంగాలపైనా పడుతుందని పేర్కొన్నారు.

రిగ్ కార్మికులు, డ్రైవర్లు, వాల్వ్ కార్మికులు, మేసన్లు సహా ఈ రంగంపై ఆధారపడిన వేలాది కుటుంబాల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. సరైన అనుమతులు, పర్మిట్లు కలిగిన రిగ్ వాహనాలను అధికారులు అకారణంగా అడ్డుకోవడం, వేధించడం, సీజ్ చేయడం వంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో తవ్విన బోరుబావులకు ఎలాంటి జరిమానాలు విధించకుండా ఒకేసారి ఉచిత రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా అనుమతులు మంజూరు చేయాలని, నిర్ణీత గడువులోగా అనుమతి రాకపోతే డీమ్డ్ అప్రూవల్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. దీనివల్ల అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు తగ్గడంతో పాటు పనుల్లో జాప్యం నివారించవచ్చని తెలిపారు.

బోరుబావుల రంగాన్ని సంక్షోభం నుంచి కాపాడాలి

ఎండిపోయిన బోరుబావులకు తిరిగి తవ్వకాలు చేపట్టేందుకు ప్రతిసారీ కొత్త అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నిబంధనలు రూపొందించాలని కోరారు. ఆన్‌లైన్‌లో సమాచారం అందించే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. అలాగే 300 అడుగుల లోతు వరకు బోరుబావులు తవ్వుకునేందుకు అనుమతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భూగర్భ జలాల పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టే చర్యలకు రిగ్ ఓనర్లు పూర్తిస్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని అంజిరెడ్డి, నర్సిరెడ్డి స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ ఎంత ముఖ్యమో, ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల ఉపాధి, వారి కుటుంబాల ఆర్థిక భద్రత కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ఈ రెండు అంశాలను సమతుల్యం చేస్తూ ఆచరణ సాధ్యమైన విధానాలు రూపొందించాలని కోరారు.

GO నంబర్ 259లో అవసరమైన మార్పులు చేసి బోరుబావుల తవ్వకాల రంగానికి ఊరట కల్పించాలని, కార్మికుల ఉపాధికి రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో 41/2 రిగ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఓరుగంటి లక్ష్మీనారాయణ, అడ్వైజర్ శ్రీనివాసరెడ్డి, డి. కృష్ణ, మోహన్ రెడ్డి, కె. జంగయ్య గౌడ్, జగన్ మోహన్ రెడ్డి, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.