భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ దేశిని చిన్న మల్లయ్య సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక కన్వీనర్, తెలంగాణ గౌడ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మార్క అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజల కోసం ఆయన చేసిన పోరాటాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని, గౌరవెల్లి ప్రాజెక్టుకు దేశిని చిన్న మల్లయ్య పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో దేశిని చిన్న మల్లయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మార్క అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో జన్మించిన చిన్న మల్లయ్య, రైతాంగ సాయుధ పోరాటం స్ఫూర్తితో ప్రజా ఉద్యమాల్లోకి వచ్చారని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాలతో పాటు కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడారని చెప్పారు.
రాజకీయ, ప్రజా జీవితంలో ఎన్నో బాధ్యతలు చేపట్టిన చిన్న మల్లయ్య సుమారు 20 ఏళ్లపాటు గ్రామ సర్పంచిగా, సొసైటీ అధ్యక్షుడిగా, హుస్నాబాద్ సమితి అధ్యక్షుడిగా సేవలందించారని తెలిపారు. అనంతరం సుదీర్ఘకాలం ఇందుర్తి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారని, ఈ ప్రాంత అభివృద్ధిలో ముఖ్యంగా వరద కాలువల నిర్మాణానికి విశేషంగా కృషి చేశారని వివరించారు.
కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం సంఘాలను ఏర్పాటు చేసి, వారి హక్కుల సాధనకు ముందుండి పోరాడారని మార్క అనిల్ కుమార్ గౌడ్ తెలిపారు. కార్మికుల పక్షాన నిలిచిన నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా దేశిని చిన్న మల్లయ్య ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. వృద్ధాప్యంలోనూ వెనక్కి తగ్గకుండా తెలంగాణ రైతాంగ పోరాట సమితిని ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశారని చెప్పారు.
ప్రజల కోసం ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ హుస్నాబాద్ పట్టణంలో దేశిని చిన్న మల్లయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సంక్షేమం, సాగునీటి కోసం ఆయన చేసిన పోరాటానికి గుర్తింపుగా గౌరవెల్లి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తిని భావితరాలకు పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇదే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ విద్య, పరిశ్రమలు, యువతకు ఉపాధి, వైద్యం, పర్యాటకం, క్రీడా రంగాల్లో కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కె. లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, బీసీ ఐక్యవేదిక నాయకులు మేకల వీరన్న యాదవ్, వి.వి. రమణ, వెన్న రాజు, నాంపల్లి సమ్మయ్య, నాయిని రజిత, కౌన్సిలర్లు పూదరి వరప్రసాద్, వైద్యం కిరణ్, పిల్లి తిరుపతి, బొలిశెట్టి రాజు, సావుల మంజుల, నాయకులు వల్లపు రాజు యాదవ్, ముక్కెర సంపత్, బత్తుల రవీందర్, బత్తుల చంద్రమౌళి, కోహెడ కొమరయ్య గౌడ్, బుర్ర వెంకట్, పచ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్, గట్టు రాములు గౌడ్, కోయడ రాజు, మామిడి తిరుపతి, మార్క శ్రీనివాస్ గౌడ్, చెప్యాల శ్రీధర్ గౌడ్, పూదరి శ్రీనివాస్ గౌడ్, ఎండీ. హసన్, బండి కుమార్ గౌడ్, కల్లెపల్లి వెంకటస్వామి, ఇంతియాజ్, ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్, బొమ్మగాని ప్రశాంత్ గౌడ్, దుద్దెడ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.