భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దివ్యాంగ చిన్నారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని భవిత స్కూల్ కేంద్రంలో సమగ్ర శిక్ష, మెదక్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం CWSN (Children With Special Needs) విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట మండలానికి చెందిన దివ్యాంగ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన MEO యాదగిరి విద్యార్థులను ప్రోత్సహించారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అయితే గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తూ అందరికీ బహుమతులు అందజేశారు. విద్యార్థుల్లో ఆనందం నింపేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.
దివ్యాంగ పిల్లలు కూడా అన్ని రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకునేలా ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఆటల ద్వారా పిల్లల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు పరస్పర స్నేహభావం, కలిసిమెలిసి ఉండే మనస్తత్వం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాజయ్య (IERP), ప్రాథమిక పాఠశాల HM సాగరిక, ZPHS నస్కల్ HM సత్యం రెడ్డి, నగరం HM ఉమారాణి, బచ్చురాజుపల్లి HM రాజు, ఉపాధ్యాయులు ఎల్లం, సుమలత, మన్మధ, వెంకటేష్, జాకియా, స్కూల్ ఆయాలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.