భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో పెట్టుకుని రైతులకు ముందస్తు సాగు సూచనలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం 'ఖేత్ బచావో అభియాన్' కార్యక్రమం నిర్వహించారు. పంటల వైవిధ్యీకరణ, ఎల్నినో ప్రభావాలు, పంట అవశేషాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలు, సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.
ఆరుతడి పంటలను సాగు చేయాలి
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి షేక్ యాస్మిన్ మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నందున రైతులు ముందుగానే అప్రమత్తం కావాలని సూచించారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తెలిపారు. పంటల మార్పిడి విధానాన్ని అనుసరించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు నేల సారాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.
పంట అవశేషాలను కాల్చవద్దు
పంట కోతల తర్వాత పొలాల్లో మిగిలే అవశేషాలను కాల్చడం వల్ల అనేక నష్టాలు జరుగుతాయని వ్యవసాయ అధికారి వివరించారు. పంట అవశేషాలను దహనం చేయడం వల్ల నేలలో ఉండే ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు నశించడంతో పాటు భూమి సారం తగ్గుతుందని, వాయు కాలుష్యం కూడా పెరుగుతుందని తెలిపారు. వాటిని కాల్చకుండా సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగించాలని, తద్వారా నేలలో సేంద్రియ పదార్థం పెరిగి భూసారం మెరుగుపడుతుందని రైతులకు సూచించారు.
నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి
రైతులు నానో యూరియా వినియోగంపై అవగాహన పెంచుకోవాలని, ఎరువులను అవసరానికి అనుగుణంగా శాస్త్రీయ పద్ధతుల్లో ఉపయోగించాలని అధికారులు సూచించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంతో పాటు నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే విధానాలను అనుసరించాలని తెలిపారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి షేక్ యాస్మిన్, స్థానిక సర్పంచ్ భవాని శేఖర్, PACS చైర్మన్ గుండా వెంకన్న, ఉప సర్పంచ్ ఐలయ్య, వ్యవసాయ విస్తరణ అధికారి చందులాల్, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.