భారత్ సమాచార్, విద్య : తెలంగాణ విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో 10+2 విద్యా విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుత విద్యా విధానాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చడంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ మేరకు బోధి పెవిలియన్లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిర్మాణం ప్రకారం.. నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ప్రాథమిక విద్యగా, ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు సెకండరీ విద్యగా, తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు సీనియర్ సెకండరీ విద్యగా విభజించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11, 12వ తరగతులు ఇంటర్మీడియట్ విద్య పరిధిలో ఉండగా, కొత్త విధానంతో ఈ తరగతులను కూడా పాఠశాల విద్యా వ్యవస్థలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులకు భాషా పరిజ్ఞానం, సమాచార నైపుణ్యాలపై పట్టు సాధించేలా బోధన ఉండాలని సీఎం సూచించారు.
పదో తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేస్తున్న పరిస్థితిని తగ్గించడం కూడా ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బాలికలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్లో చేరకుండా చదువుకు దూరమవుతున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 12వ తరగతి వరకు నిరంతర విద్య అందడం వల్ల డ్రాప్అవుట్లు తక్కువగా ఉన్నాయని ప్రస్తావించారు. ఇప్పటికే 18 రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉందని అధికారులు వివరించారు.
కొత్త విధానం అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దడంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే ఈ మార్పులకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, అమలు విధానం ఇంకా వెల్లడికావాల్సి ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులపై ప్రభావం పడకుండా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.