భారత్ సమాచార్, ఉద్యోగం : రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ అభ్యర్థులకు కీలక సమాచారం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) విడుదల చేసిన ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ (CEN 07/2026) ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1,688 పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 15న ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 13, 2026 రాత్రి 11.59 గంటలకు ముగుస్తుంది.
ఈ నోటిఫికేషన్లో నాలుగు రకాల పోస్టులు ఉన్నాయి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు 700, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 200, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 600, ట్రైన్స్ క్లర్క్ పోస్టులు 188 చొప్పున ఉన్నాయి. వీటిలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులకు అత్యధిక ఖాళీలు కేటాయించారు. సికింద్రాబాద్ ఆర్ఆర్బీ పరిధిలో మొత్తం 72 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా 2027 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కొన్ని వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ఉంటాయి. పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్లో తప్పనిసరిగా పరిశీలించాలి.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈరోజు రాత్రి 11.59 గంటల్లోపు అధికారిక దరఖాస్తు పోర్టల్ [rrbapply.gov.in ద్వారా దరఖాస్తు సమర్పించాలి. ఇప్పటికే దరఖాస్తు చేసినవారు ఫీజు చెల్లింపును నవంబర్ 15లోపు పూర్తి చేయవచ్చు. దరఖాస్తు సవరణలకు నవంబర్ 16 నుంచి 25 వరకు అవకాశం కల్పించారు. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయడం మంచిది.