భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

తెలంగాణ గిగ్‌ వర్కర్లకు గుడ్‌న్యూస్‌..

తెలంగాణ గిగ్‌ వర్కర్లకు గుడ్‌న్యూస్‌..

భార‌త్ స‌మాచార్, హైద‌రాబాద్ : తెలంగాణలో గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ ఆధారిత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌ డెలివరీ సిబ్బంది, క్యాబ్‌ డ్రైవర్లు, ఇతర డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సేవలందించే కార్మికులకు సామాజిక భద్రత కల్పించేలా ప్రత్యేక చట్టానికి సంబంధించిన నిబంధనలు, సంక్షేమ చర్యలను నవంబర్‌ 14 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల మంది గిగ్‌ వర్కర్లకు ఈ విధానం ద్వారా ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

హైదరాబాద్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ కార్యక్రమంలో పాల్గొని గిగ్‌ వర్కర్లకు సంబంధించిన సంక్షేమ విధానాలను ప్రకటించేందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఆహ్వానించినట్లు తెలిపారు. భారత్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్‌ గాంధీ శనివారం గిగ్‌ వర్కర్లతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలు, వారి హక్కులు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై చర్చించనున్నారు.

గిగ్‌ వర్కర్ల నమోదు కోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్‌ ద్వారా కార్మికుల వివరాలను నమోదు చేయడంతో పాటు వారి సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు వీలుంటుంది. ప్రమాద బీమా, సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వంటి అంశాలకు కొత్త నిబంధనల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి గతంలో వెల్లడించారు.

కాగా, తెలంగాణ ప్లాట్‌ఫామ్‌ ఆధారిత గిగ్‌ వర్కర్ల (రిజిస్ట్రేషన్‌, సామాజిక భద్రత, సంక్షేమం) చట్టం–2026కు ఏప్రిల్‌ 25న గవర్నర్‌ ఆమోదం లభించగా, జూన్‌ 2 నుంచే చట్టం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు దాని అమలుకు సంబంధించిన నిబంధనలు, సంక్షేమ బోర్డు ఏర్పాటు వంటి చర్యలను ముందుకు తీసుకెళ్తున్నారు. డెలివరీ, రవాణా రంగాల్లో పనిచేస్తూ ఉద్యోగ భద్రత, ప్రమాదాల ముప్పు, సంక్షేమ సదుపాయాల కొరతను ఎదుర్కొంటున్న వేలాది మంది కార్మికులకు ఈ చర్యలు ఎంతవరకు అండగా నిలుస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.