భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

అర్హులైన కుటుంబాలు మిస్ కావొద్దు.. కలెక్టర్ కీలక సూచన!

అర్హులైన వారు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని  సద్వినియోగం చేసుకోవాలి

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేయనున్న ప్రతిష్ఠాత్మక ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కోరారు. కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా ₹.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతోందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

ఈ పథకం కింద కుటుంబంలోని ప్రధాన సంపాదనపరుడికి బీమా రక్షణ కల్పిస్తామని కలెక్టర్ వివరించారు. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. వయస్సు నిర్ధారణ కోసం ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీనే ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేశారు.

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19న జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణ వార్డుల స్థాయిలో ఈ శిబిరాలు ఏర్పాటు చేసి అర్హులైన కుటుంబాల వివరాలను సేకరిస్తామని తెలిపారు.

నమోదు సమయంలో కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ నంబర్లు, బీమా పొందే ప్రధాన సభ్యుడి వివరాలు, నామినీ వివరాలతో దరఖాస్తులు తీసుకుంటారని చెప్పారు. ఒకవేళ నామినీ మైనర్ అయితే వారి సంరక్షకుడి వివరాలను కూడా తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. దరఖాస్తుల సేకరణలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ఆధార్, నామినీ తదితర వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.

సేకరించిన దరఖాస్తులను డిజిటల్ విధానంలో నమోదు చేసి, వాటి స్కాన్ కాపీలను సంబంధిత బీమా సంస్థకు పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. అసలు దరఖాస్తులను జిల్లా స్థాయిలో భద్రపరుస్తామని వివరించారు. నమోదు ప్రక్రియ పారదర్శకంగా, తప్పులు లేకుండా జరిగేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

బీమా పొందిన వ్యక్తి మరణించిన సందర్భంలోనూ పరిహారం అందించే ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన విధంగా చేపడతామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారి ద్వారా మరణించిన వ్యక్తికి సంబంధించిన వివరాలను నమోదు చేస్తారని వివరించారు. సంబంధిత అధికారుల పరిశీలన, జిల్లా స్థాయి ఆమోదం తర్వాత బీమా సంస్థకు ప్రతిపాదనలు పంపిస్తారని పేర్కొన్నారు.

అర్హత నిర్ధారణ ప్రక్రియ పూర్తయిన అనంతరం ₹.5 లక్షల బీమా పరిహారాన్ని నామినీ బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేసేలా చర్యలు తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు. ఈ పథకంపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న ఒక్క కుటుంబం కూడా నమోదు కాకుండా మిగిలిపోకూడదని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

కావున అర్హులైన కుటుంబాలు ఈ నెల 19న తమ గ్రామాలు, పట్టణ వార్డుల్లో నిర్వహించే ప్రత్యేక నమోదు శిబిరాలకు అవసరమైన వివరాలతో హాజరై ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా విజ్ఞప్తి చేశారు.