భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ స్కీమ్ (OPS) విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ మేరకు చేగుంట మండలంలోని తపస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సంఘం నాయకులు ప్రభుత్వ వైఖరిపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా తపస్ నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో CPS విధానాన్ని రద్దు చేసి OPS విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలంటే పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని స్పష్టం చేశారు.
అదేవిధంగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్, గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి వారికి ఇచ్చిన హామీల ప్రకారం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తగిన నిర్ణయాలు తీసుకోవాలని తపస్ నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి దుబాషి భాస్కర్, రాష్ట్ర కోశాధికారి దేశ్ భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్, రంగారెడ్డి, తపస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు జిడ్డి ఎల్లం, ప్రధాన కార్యదర్శి జాల సిద్దు తదితరులు పాల్గొన్నారు.