భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు అవుసుల సంఘం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని తెలిపారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు వార్డుల వారీగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, కౌన్సిలర్లు బైరం సప్న కుమార్, పుట్టి సందీప్, డాకి శ్యామల స్వామి, కోఆప్షన్ సభ్యురాలు చింతల రాధా భవాని యాదగిరి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం. శెట్టి అశోక్, మట్టి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.