భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు*  *మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ సహాయ న్యాయవాది జి. శ్రీధర్ రెడ్డి, మండల లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ లీగల్ సర్వీస్ కౌన్సిల్ న్యాయవాది కాట్రోత్ రాజు నాయక్ పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువుతో పాటు చట్టాలపై కూడా అవగాహన పెంచుకోవాలని, జీవితంలో లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, మెదక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నర్సాపూర్ మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ ఎం. హేమలత సూచనల మేరకు మాదకద్రవ్యాల నియంత్రణ అంశంపై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన ప్రభుత్వ సహాయ న్యాయవాది జి. శ్రీధర్ రెడ్డి, లీగల్ సర్వీస్ కౌన్సిల్ న్యాయవాది కాట్రోత్ రాజు నాయక్ విద్యార్థులకు వివిధ చట్టాల గురించి వివరించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబాలు, సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ అనేది కేవలం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలతో పాటు విద్యార్థులు కూడా ఈ విషయంలో చైతన్యంతో వ్యవహరించాలని చెప్పారు.

నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు*  *మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ

యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా జాగ్రత్తగా ఉండాలని, తమ స్నేహితులు, పరిచయస్తుల్లో ఎవరైనా ఇలాంటి అలవాట్లకు బానిసలవుతున్నట్లు గుర్తిస్తే వారికి సరైన అవగాహన కల్పించాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం ఏర్పడాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరమని న్యాయవాదులు తెలిపారు. చట్టాల గురించి ప్రాథమిక విషయాలు తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలపై సరైన అవగాహనతో వ్యవహరించవచ్చని చెప్పారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టాలని, క్రమశిక్షణ, పట్టుదలతో కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఏ. ఆనంద్ కుమార్, మాజీ ఏజీపీ పి. సుధాకర్, మాజీ లీగల్ సర్వీస్ కౌన్సిల్ న్యాయవాది సి.హెచ్. స్వరూప రాణి, న్యాయవాదులు ఏ. సాయిరాం, నీలవేణి, కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ డి. నాగరాజ్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రవీందర్, కళాశాల అధ్యాపకులు, లీగల్ సర్వీస్ సిబ్బంది టి. అరుణ, వై. శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.