భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్..

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్..

భార‌త్ స‌మాచార్, విద్య‌ : పుస్తకాల్లో చదివిన చరిత్రను ప్రత్యక్షంగా చూసే అవకాశం తెలంగాణ విద్యార్థులకు కలగనుంది. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ‘తెలంగాణ దర్శిని’ పేరుతో ప్రత్యేక విద్యా పర్యటనలకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా రెండో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 2,92,286 మంది విద్యార్థులను రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు. ఇందుకోసం మొత్తం రూ.26.30 కోట్ల వ్యయాన్ని అంచనా వేశారు.

ఈ కార్యక్రమాన్ని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC), విద్యాశాఖ సమన్వయంతో నిర్వహించనున్నాయి. ఒక్కో విద్యార్థిపై రోజుకు రూ.900 ఖర్చు చేయనున్నారు. ఇందులో సమగ్ర శిక్షా అభియాన్‌ కింద విద్యాశాఖ రూ.500, పర్యాటక శాఖ రూ.400 చొప్పున భరించనున్నాయి. మొత్తం వ్యయంలో విద్యాశాఖ వాటా రూ.14.61 కోట్లు కాగా, పర్యాటక శాఖ వాటా రూ.11.69 కోట్లుగా ఉంది. పర్యటనల షెడ్యూల్‌, ప్రాంతాల ఎంపిక, రవాణా తదితర ఏర్పాట్లను పర్యాటక అభివృద్ధి సంస్థ పర్యవేక్షించనుంది.

ఈ విజ్ఞాన యాత్రల్లో భాగంగా హైదరాబాద్‌లోని గోల్కొండ కోట, చార్మినార్‌, చౌమహల్లా ప్యాలెస్‌, వరంగల్‌ కోట, రామప్ప ఆలయం, వేయి స్తంభాల గుడి, భువనగిరి కోట వంటి చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పించనున్నారు. బుద్ధవనం, కొలనుపాక జైన మందిరం వంటి వారసత్వ ప్రదేశాలతో పాటు శిల్పారామం, పోచంపల్లి, చేర్యాల, నిర్మల్‌ ప్రాంతాల్లోని కళలు, హస్తకళలను విద్యార్థులకు పరిచయం చేయనున్నారు. ప్రకృతి అందాలను చూపించేందుకు లక్నవరం, పాకాల సరస్సులు, అనంతగిరి కొండలు, కవ్వాల్‌, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లు, మేడారం, నాగార్జునసాగర్‌ ప్రాంతాలను కూడా పర్యటనల జాబితాలో చేర్చనున్నారు.

తరగతి గదుల్లో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా విద్యార్థులకు మరింత స్పష్టమైన అవగాహన కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, కళా సంపద, ప్రకృతి ప్రాంతాల విశిష్టతను తెలుసుకోవడంతో పాటు వాటి పరిరక్షణపై కూడా విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని అంచనా వేస్తోంది. తెలంగాణ గొప్పదనాన్ని భావితరాలకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఈ పర్యటనలు విద్యార్థులకు విజ్ఞానంతో పాటు కొత్త అనుభవాలను అందించనున్నాయి.