భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

O.M మూవీ రివ్యూ: ధనుష్, సాయిపల్లవి నటన అదుర్స్..

O.M మూవీ రివ్యూ: ధనుష్, సాయిపల్లవి నటన అదుర్స్..

భార‌త్ స‌మాచార్, సినిమా : ధనుష్, సాయిపల్లవి, శ్రీలీల, మమ్ముట్టి, నసీరుద్దీన్ షా.. ఇలా ఐదుగురు ప్రముఖ నటీనటులు ఒకే సినిమాలో కనిపిస్తే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి భారీ తారాగణంతో రూపొందిన చిత్రం 'O.M (ఆపరేషన్ మోల్)'. 'అమరన్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈసారి ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ డ్రామాను తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? కథ, నటీనటుల ప్రదర్శన, సాంకేతిక విభాగాల పనితీరు ఎలా ఉన్నాయో చూద్దాం.

చిత్తూరు, తిరుపతి అటవీ ప్రాంతాల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతుంటుంది. ఈ మాఫియా వెనుక కార్తికేయన్ (మమ్ముట్టి), దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే అబ్దుల్ హమీద్ (నసీరుద్దీన్ షా) కీలకంగా ఉంటారు. ఈ అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారిణి నిత్యారెడ్డి (సాయిపల్లవి) రంగంలోకి దిగుతుంది. తన తండ్రి, భర్తను ఇదే మాఫియా బలితీసుకోవడంతో నేరస్థులకు శిక్ష పడేలా చేయాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఇందులో భాగంగా పోలీస్ అధికారి పళని (ధనుష్)ను అండర్‌కవర్ ఆపరేషన్ కోసం రంగంలోకి దింపుతుంది. తన గుర్తింపును మార్చుకుని తిరుగా కార్తికేయన్ ముఠాలో చేరిన పళని, అతడి నమ్మకాన్ని ఎలా సంపాదించాడు? ఈ ఆపరేషన్‌లో ఎదురైన సవాళ్లేంటి? అన్నది కథ.

ఈ సినిమా ప్రధాన బలం నటీనటుల ప్రదర్శన. ధనుష్ తన పాత్రలోని భావోద్వేగాలను, అండర్‌కవర్ అధికారిగా ఎదుర్కొనే సంఘర్షణను చక్కగా చూపించారు. సాయిపల్లవి నిత్యారెడ్డి పాత్రలో హుందాగా నటించడమే కాకుండా, యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్నారు. మమ్ముట్టి తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీలీలకు లభించిన పాత్ర పరిధి తక్కువే అయినప్పటికీ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించారు. నసీరుద్దీన్ షా పాత్రకు మరింత ప్రాధాన్యం ఇచ్చి ఉంటే బాగుండేదనిపిస్తుంది.

దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఎర్రచందనం స్మగ్లింగ్ కథకు కేవలం పోలీస్, మాఫియా మధ్య పోరాటాన్ని మాత్రమే పరిమితం చేయలేదు. ఈ అక్రమ వ్యాపారంలో కూలీలుగా పనిచేసే గిరిజనులు, వారి కుటుంబాలు ఎదుర్కొనే కష్టాలను కూడా ప్రస్తావించారు. తిరుపతి, అరుణాచలం అటవీ ప్రాంతాల అందాలను కెమెరామెన్ చక్కగా చిత్రీకరించారు. సాయి అభయంకర్ నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలకు బలాన్నిచ్చింది. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, అడవిలో జరిగే పోరాటాలు ఆకట్టుకుంటాయి.

అయితే సినిమా నిడివి, కథనం ప్రధానమైన ప్రతికూలతలుగా కనిపిస్తాయి. అసలు కథలోకి వెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, కొన్ని సన్నివేశాలను సాగదీయడం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. ఉత్కంఠభరితంగా సాగాల్సిన కొన్ని భాగాల్లో వేగం తగ్గుతుంది. ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే సినిమా ప్రభావం పెరిగేది. మొత్తంగా మంచి కథాంశం, బలమైన నటీనటులు, యాక్షన్, ఎమోషన్స్ ఉన్నప్పటికీ స్క్రీన్‌ప్లేలో లోపాల కారణంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన చిత్రంగా 'O.M' నిలుస్తుంది.