భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, ఈ ప్రాంతానికి నిధుల కేటాయింపులో అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి నిధుల పోరాట సమితి డిమాండ్ చేసింది. శుక్రవారం రామాయంపేటలో సమావేశమైన సమితి నాయకులు మెదక్ ప్రాంత అభివృద్ధిపై తమ డిమాండ్లను వెల్లడించారు. ఈ మేరకు సమితి కన్వీనర్, న్యాయవాది కొండన్ సుభాష్ చంద్ర గౌడ్, కో కన్వీనర్ వెల్ముల సిద్ధి రాములు ప్రకటన విడుదల చేశారు.
గతంలో ప్రజా ఉద్యమాల ద్వారా మెదక్–అక్కన్నపేట రైలు మార్గాన్ని సాధించుకున్నామని వారు గుర్తుచేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు కలిసి ముందుకు వస్తే మెదక్ ప్రాంత అభివృద్ధికి మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. త్వరలో మండలాల వారీగా ప్రజలను, ప్రజాప్రతినిధులను కలుపుకొని పోరాట సమితిని మరింత విస్తరించడంతో పాటు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని వెల్లడించారు.
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించారని, గతంలో రామాయంపేట నియోజకవర్గానికి టి. అంజయ్య ప్రాతినిధ్యం వహించారని గుర్తుచేశారు. చారిత్రకంగా, రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న మెదక్ ప్రాంతం ఇప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతానికి ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించి, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
మెదక్ జిల్లాలోని చర్చి, మెదక్ ఖిల్లా, ఏడుపాయల వంటి చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాలని కోరారు. పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆయా ప్రాంతాలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తే జిల్లాకు మరింత గుర్తింపు, ఆదాయం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ ప్రాంతానికి ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
గత 25 సంవత్సరాలుగా మెదక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యాలయాలు, చేపట్టిన అభివృద్ధి పనులు సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకు తరలిపోతున్నాయని పోరాట సమితి నాయకులు ఆరోపించారు. మెదక్‌లో పరిశ్రమలు, విద్యాసంస్థలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ప్రాధాన్యం కలిగిన మెదక్, రామాయంపేట ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడటం ఆందోళనకరమని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని మెదక్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు పార్టీలు, రాజకీయాలకు అతీతంగా కలిసి వచ్చి మెదక్ అభివృద్ధి కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కన్వీనర్ కొండన్ సుభాష్ చంద్ర గౌడ్, కో కన్వీనర్ వెలుముల సిద్ధి రాములుతో పాటు బాసమ్ అనిల్, సాదుల నాగరాజు, నితిన్, రాయిలాపూర్ శ్రీనివాస్, ఏసు రెడ్డి, శేఖర్, ప్రవీణ్, స్వామి, దంతేపల్లి సర్పంచ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.