భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మండల స్థాయిలో ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో మండల ప్రజల నుంచి 3 దరఖాస్తులు అందాయి. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో సింగారపు కుమార్, స్థానిక తహసీల్దార్ చంద నరేష్‌తో పాటు 18 శాఖలకు చెందిన అధికారులు హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి దరఖాస్తులు సమర్పించారు. అనంతరం ఎంపీడీవో సింగారపు కుమార్ దరఖాస్తుల వివరాలను వెల్లడించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం మూడు దరఖాస్తులు అందినట్లు తెలిపారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి ఒక దరఖాస్తు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి ఒక ఫిర్యాదు, వ్యవసాయ శాఖకు సంబంధించిన మరో దరఖాస్తు వచ్చినట్లు వివరించారు.
ప్రజల సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి అవకాశం కల్పించే ప్రజావాణి కార్యక్రమం మంచి వేదికగా ఉపయోగపడుతుందని ఎంపీడీవో పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు ఒకే వేదికపై అందుబాటులో ఉండటం వల్ల ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.