భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఈసారి ఆరుతడి పంటలపై దృష్టి పెట్టండి

అయ్యగారిపల్లిలో యాసంగి సాగుపై అవగాహన

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: యాసంగి సాగులో రైతులు పంటల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో ఇనుగుర్తి మండలంలోని అయ్యగారిపల్లి గ్రామంలో సోమవారం యాసంగి సాగు, ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ MAO ఎస్.కె. యాస్మిన్ ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచి మలిశెట్టి శోభన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా MAO యాస్మిన్ మాట్లాడుతూ.. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం తగ్గి వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. ఎల్‌నినో కారణంగా పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు వేడెక్కుతాయని, దీంతో అక్కడ ఏర్పడే వేడి గాలులు ప్రపంచ వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతాయని తెలిపారు. ఈ ప్రభావంతో సాధారణంగా రావాల్సిన రుతుపవనాల దిశల్లో మార్పులు చోటుచేసుకుని, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవకుండా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, కుంభవృష్టి నమోదయ్యే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు.

మన ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోయాయని, దీంతో యాసంగి పంటలకు నీటి కొరత ఏర్పడే పరిస్థితి ఉందని యాస్మిన్ తెలిపారు. నీటి లభ్యత తగ్గితే వ్యవసాయంతో పాటు విద్యుత్ ఉత్పత్తిపైనా ప్రభావం పడుతుందని వివరించారు. నదీ జలాల ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నందున వర్షాలు లేకపోవడం వల్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. అయితే అవసరమైన సమయంలో విద్యుత్ అందుబాటులోకి వస్తుందా లేదా అనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

ఆరుతడి పంటలే సాగు చేసుకోవాలి: MAO

ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో నీటిపై ఎక్కువగా ఆధారపడే పంటలను సాగు చేయకుండా రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని MAO యాస్మిన్ సూచించారు. జొన్న, సజ్జ, మినుము, పెసరతో పాటు వివిధ రకాల కూరగాయలను సాగు చేసుకోవాలని చెప్పారు. ఈ పంటలకు తక్కువ నీరు సరిపోతుందని, పరిస్థితులకు అనుగుణంగా సాగు చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటాయని వివరించారు.

అలాగే రైతులకు ఉపయోగపడేలా ఇనుగుర్తి రైతు వేదికలో సబ్సిడీపై పెసర విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, తమ పొలాల్లో నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ AE లక్ష్మణ్, వార్డు సభ్యుడు సూర్య నాయక్, AEO భాస్కర్‌తో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.