భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కార్తీక పౌర్ణమి సందర్భంగా మండల కేంద్రం ఇనుగుర్తిలోని శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పండుగను పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఆలయ పూజారి కందాల ఆదర్శాచార్యులు వేదమంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులతో దీపారాధన చేయించారు. కార్తీక పౌర్ణమి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి పూజలు చేశారు. ఒక్కొక్కరి పేరున 365 వత్తుల కట్టలను వెలిగించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం దీపాల వెలుగులతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొల్లోజు ప్రభాకర చారి మాట్లాడుతూ.. వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ప్రతిరోజూ నిత్య పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.