భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్లైన్ నమోదు కార్యక్రమం తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MPDO చలపతి హాజరై పథకం వివరాలను గ్రామస్థులకు వివరించారు.
ఈ సందర్భంగా MPDO చలపతి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ₹5 లక్షల జీవిత బీమా రక్షణ లభిస్తుందని చెప్పారు. కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు, అనుకోని పరిస్థితుల్లో బాధిత కుటుంబాలు ఇబ్బందులు పడకుండా అండగా నిలవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. అర్హత కలిగిన లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో అర్హులైన ప్రతి కుటుంబం పథకంలో నమోదు చేసుకునేలా అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోర సంధ్య, బిక్షం, APO కృష్ణయ్య, గ్రామ కార్యదర్శి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.