భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు ముందుగానే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో సర్పంచ్ స్వప్న రమేష్ అధ్యక్షతన ఎల్నినో స్పెషల్ గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి మండల స్పెషల్ ఆఫీసర్ దేవకుమార్ ముఖ్య అతిథిగా హాజరై వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం, వ్యవసాయంపై దాని ప్రభావం గురించి ప్రజలకు వివరించారు.
రానున్న కాలంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసే అవకాశం తక్కువగా ఉన్నందున రైతులు వరి సాగును తగ్గించాలని దేవకుమార్ సూచించారు. వరికి బదులుగా మొక్కజొన్న, కుసుమ, గోధుమ, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని చెప్పారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను కొంతవరకు నివారించవచ్చని వివరించారు.
MPDO రజినీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ గ్రామపంచాయతీ సిబ్బందికి సహకరించాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం కూడా ముఖ్యమని తెలిపారు.
RWS AE బిక్షపతి మాట్లాడుతూ రానున్న రోజుల్లో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. నీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వినియోగించాలని, ఇంటి అవసరాలకు సరిపడా నీటిని తీసుకున్న తర్వాత కుళాయిలను తప్పనిసరిగా ఆఫ్ చేయాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ నీటి పొదుపును అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులను తగ్గించుకోవచ్చని చెప్పారు.
విద్యుత్ శాఖ AE గణేష్ మాట్లాడుతూ రానున్న కాలంలో విద్యుత్ సమస్యలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ పంటల సాగు విషయంలో రైతులు ముందుగానే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పంటలు వేసుకోవాలని చెప్పారు.
హార్టికల్చర్ శాఖ HEO కీర్తన, ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్, కూరగాయల పంటలను సాగు చేయాలని సూచించారు. ఆయా పంటల సాగు ద్వారా మంచి దిగుబడులు పొందే అవకాశాలు ఉన్నాయని వివరించారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ సాగుపై కూడా దృష్టి పెట్టాలని కోరారు.
అగ్రికల్చర్ AO సోమలింగారెడ్డి, AEO రమ్య మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం కారణంగా రానున్న కాలంలో వ్యవసాయ రంగానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. రైతులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందుగానే అప్రమత్తమై ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఇరిగేషన్ AE శ్రీనిధి మాట్లాడుతూ చెరువుల్లోని నీటిని బోరు మోటార్ల ద్వారా ఎవరూ తరలించకూడదని స్పష్టం చేశారు. చెరువుల్లో అందుబాటులో ఉన్న నీటిని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచుకోవాలని, నీటి వృథాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
గ్రామసభ అనంతరం గ్రామపంచాయతీలో అమలవుతున్న ఇందిరమ్మ బీమా ఇన్సూరెన్స్ పథకం పనితీరును మండల స్పెషల్ ఆఫీసర్ దేవకుమార్, సర్పంచ్ స్వప్న రమేష్తో కలిసి పరిశీలించారు. పథకం అమలు తీరును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాదలక్ష్మి, ఉప సర్పంచ్ ఎడ్ల అంజిరెడ్డి, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ బాలయ్య, మాజీ ఎంపీటీసీ బీజ్జ దాస్, అంగన్వాడీ టీచర్లు రామలక్ష్మి, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, బీజ్జ దేవయ్య, చాకలి నర్సింలు, కుమార్, కమ్మరి నరసింహ చారి, లడ్డ బాబు, నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.