భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఎల్నినో ప్రభావంతో యాసంగి సీజన్లో సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ఇప్పటి నుంచే అప్రమత్తం కావాలని వ్యవసాయ అధికారులు సూచించారు. తక్కువ నీటితో సాగు చేసుకునే ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామంలో రైతులకు ఖేత్ బచావో అభియాన్, ఆరుతడి పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి స్వామి మాట్లాడుతూ.. యాసంగి సీజన్లో ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు, సాగునీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. దీంతో రైతులు పంటల సాగు విషయంలో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలపై ఆధారపడకుండా, తక్కువ నీటితో పండించే ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా నీటి కొరత సమస్యను అధిగమించవచ్చని వివరించారు.
రబీ సీజన్లో నూనెగింజల పంటలకు ఉన్న ప్రాధాన్యతను, వాటి సాగు విధానాలను రైతులకు వివరించారు. పంటల ఎంపికతో పాటు సాగు భూమిని సంరక్షించుకోవడం కూడా ముఖ్యమని తెలిపారు. నేల సారాన్ని కాపాడుకునేందుకు రైతులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో పండించిన పంటల అవశేషాలను పొలాల్లో కాల్చకుండా, వాటిని భూమిలో కలియదున్నాలని స్వామి సూచించారు. ఇలా చేయడం వల్ల నేలలో సేంద్రియ పదార్థాలు పెరిగి భూసారం మెరుగుపడుతుందని వివరించారు. పంటల అవశేషాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహ్మదాపూర్ సర్పంచ్ జిల్లెల తిరుమల-తిరుపతి రెడ్డి, ఉప సర్పంచ్ కత్తుల సమ్మరాజు, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, గ్రామ రైతులు పాల్గొన్నారు.