భారత్ సమాచార్, రంగారెడ్డి జిల్లా: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ గ్రామాల్లో కొనసాగుతోంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో అర్హులైన వారి వివరాలను నమోదు చేస్తున్నారు. గ్రామంలో మొత్తం 702 మంది ఈ పథకానికి అర్హులుగా ఉండగా, బుధవారం నాటికి సుమారు 100 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నట్లు నాయకులు గొండస్వామి తెలిపారు.
గ్రామ సర్పంచ్ సంతోష గొండస్వామి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నాయకులు గొండస్వామి యాదవ్, శ్రీరామ్ భరత్ అవసరమైన సూచనలు చేస్తూ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకంలో భాగస్వాములు అయ్యేలా గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఈ సందర్భంగా గొండస్వామి, భరత్ మాట్లాడుతూ.. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ఈ పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన కుటుంబంలో సంపాదించే సభ్యుడికి ₹5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు.
బీమా పొందిన వ్యక్తి మరణించిన సందర్భంలో నామినీకి ₹5 లక్షల బీమా పరిహారం అందుతుందని, ఇందుకు సంబంధించిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తుందని చెప్పారు.
నమోదు చేసుకునే సమయంలో అర్హులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్‌తో పాటు నామినీకి సంబంధించిన వివరాలను అందించాలని సూచించారు. గ్రామంలో ఇంకా నమోదు చేసుకోని అర్హులైన వారందరూ అవసరమైన పత్రాలతో ముందుకు వచ్చి తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ బీమా అవకాశాన్ని ప్రతి అర్హ కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని గొండస్వామి, భరత్ విజ్ఞప్తి చేశారు.