భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకం ద్వారా నిర్మించిన ఇంటి గృహప్రవేశ వేడుకలో మానుకోట ఎమ్మెల్యే డా. మురళి నాయక్ పాల్గొన్నారు. కార్తీక మాసంలోని శుభప్రదమైన బుధవారం రోజున ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు బెజ్జం యాకమ్మ, వెంకటాద్రి దంపతులు నిర్వహించిన గృహప్రవేశ వేడుకకు ఎమ్మెల్యే హాజరై, తహసీల్దార్ చంద నరేష్, MPDO సింగారపు కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇంట్లో ఏర్పాటు చేసిన సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి యాకమ్మ, వెంకటాద్రి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేస్తోందన్నారు. సొంత ఇల్లు ఉండాలనే ఎన్నో ఏళ్ల ఆశ నెరవేరడంతో పేద కుటుంబాల్లో ఆత్మగౌరవం వెల్లివిరుస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదలకు సొంతింటి భరోసా కల్పిస్తూ, వారి జీవితాల్లో కొత్త ఆశలు నింపుతున్నామని పేర్కొన్నారు.
ఇందిరమ్మ బీమా నమోదు చేసిన ఎమ్మెల్యే..
గృహప్రవేశ వేడుక అనంతరం ఎమ్మెల్యే మురళి నాయక్ మరో కీలక కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్త ఇంట్లోనే యాకమ్మ, వెంకటాద్రి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ బీమా వర్తించేలా స్వయంగా ల్యాప్‌టాప్‌లో వివరాలను నమోదు చేశారు. బీమా నమోదు ప్రక్రియ పూర్తయ్యాక సంబంధిత నమోదు పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భద్రతతో పాటు భవిష్యత్తుపై ధీమా కల్పిస్తుందని తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని, కుటుంబంలో 18 ఏళ్లు నిండిన నుంచి 59 ఏళ్లలోపు వయస్సు ఉన్న వ్యక్తులు అర్హత మేరకు నమోదు చేసుకోవచ్చని వివరించారు. బీమా పొందిన వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే, సంబంధిత కుటుంబానికి ₹5 లక్షల బీమా సాయం అందుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డి, ఉప సర్పంచ్ ఉప్పలయ్య, పార్టీ నాయకులు సత్యపాల్ రెడ్డి, గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, పెరుమాండ్ల శంకర్ గౌడ్, మల్లేశం గౌడ్, జెల్ల వెంకటేష్, చిన్నబోయిన శ్రీను, ప్రేమ్ కుమార్, మహేశ్వరి, మునేష్, సరిత, GPO సందీప్ తదితరులు పాల్గొన్నారు.