భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, హక్కులు కల్పించే గొప్ప పునాది అని నెల్లికుదురు ఎంపీడీవో సింగారపు కుమార్ తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించిన ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో సింగారపు కుమార్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశంలోని ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, హక్కులు అందించాలనే గొప్ప లక్ష్యంతో రూపొందించబడిందని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను తెలుసుకోవడంతో పాటు ప్రతి పౌరుడు తన బాధ్యతలను కూడా గుర్తించాలని సూచించారు. దేశ పౌరులందరూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, దానికి లోబడి వ్యవహరించాలని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దుర్గ భవాని తండా సర్పంచ్ వీరన్న నాయక్, BJP జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు మదన్ లాల్, సూపరింటెండెంట్ నరసింహారావు, ఈబీజీ రాంజీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.