భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ఎల్‌నినో ఎఫెక్ట్‌పై అలర్ట్.. నీటిని పొదుపు చేయండి

ఎల్‌నినో ప్రభావంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి  నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి – అదనపు కలెక్టర్ నగే

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గి వ్యవసాయం, తాగునీటి సరఫరా, పశుసంపదపై ప్రభావం పడే అవకాశం ఉందని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని, నీటిని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. గురువారం నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న ఆయన ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై మాట్లాడారు.

ఎల్‌నినో కారణంగా వర్షపాతం తగ్గితే భూగర్భ జలమట్టాలు పడిపోయే ప్రమాదం ఉందని, దీంతో బోరుబావుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉంటుందని అదనపు కలెక్టర్ వివరించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తాగునీటిని అవసరమైన మేరకే వినియోగించాలని కోరారు. ఇంట్లో నల్లాల ద్వారా నీరు వృథాగా పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి వృథాను అరికట్టడంలో ప్రతి కుటుంబం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

అలాగే మురుగునీరు వృథాగా బయటకు వెళ్లకుండా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని తెలిపారు. వర్షపు నీటితో పాటు ఇంట్లో వినియోగించిన నీటిని కూడా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకుంటే భూగర్భ జలాల పెంపునకు కొంతవరకు తోడ్పడుతుందని చెప్పారు. గ్రామస్థులు నీటి సంరక్షణను ఒక బాధ్యతగా తీసుకుని తమ ఇళ్లలోనే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ఎల్‌నినో ప్రభావంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి  నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి – అదనపు కలెక్టర్ నగే

వ్యవసాయ రంగంలోనూ రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని నగేష్ తెలిపారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంట సాగుకు దూరంగా ఉండి, తక్కువ నీటితో పండించే ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. సింగూరు సహా ఇతర జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉన్నందున రాబోయే రోజుల్లో సాగునీరు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే నీటి వినియోగంలో పొదుపు పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

సాగునీటి కోసం విద్యుత్ వినియోగం పెరిగితే విద్యుత్ సరఫరాపైనా ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని అదనపు కలెక్టర్ వివరించారు. నీరు, విద్యుత్ రెండింటినీ అవసరానికి తగినట్లుగా వినియోగించుకోవాలని సూచించారు. మేత, నీటి కొరత కారణంగా పశువుల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా పశుసంపద సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

రైతులు ప్రత్యామ్నాయ పంటలతో పాటు ఆయిల్‌పామ్ సాగును కూడా ప్రోత్సహించాలని నగేష్ సూచించారు. 25 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేసే రైతులకు సౌర విద్యుత్ సదుపాయం కల్పించనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఎదురయ్యే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు, రైతులు కూడా ముందస్తు చర్యల్లో భాగస్వాములు కావాలని తెలిపారు.

ఈ గ్రామసభలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ మహమ్మద్ మొజామ్ హుస్సేన్, మండల వ్యవసాయ అధికారిణి దీపిక, గ్రామ సర్పంచ్ చంద్రకళ, ఉపసర్పంచ్ రవి, ఉద్యానవన విస్తరణ అధికారి గోవింద్, పశువైద్యాధికారి అంజనేయులు, పంచాయతీ కార్యదర్శి, సాంకేతిక సహాయకులు, అంగన్‌వాడీ టీచర్, ఆశా కార్యకర్త, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.