భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శేరిపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పసులోటి మోతీలాల్ కోరారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు సామాజిక భద్రత అందించడమే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ పథకంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
గత ప్రభుత్వం రైతులకు మాత్రమే బీమా సౌకర్యం కల్పించిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం భూమిలేని నిరుపేదలు, రేషన్ కార్డులు కలిగిన అర్హులైన కుటుంబాలకు సైతం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని మోతీలాల్ వివరించారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండే వ్యక్తికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినా, ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా ఈ పథకం భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు వంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలనే ఉద్దేశంతో ప్రజలు వాటిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి అవసరమైన వివరాలు తెలుసుకుని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని మోతీలాల్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నాగరాజు, కాంగ్రెస్ గ్రామ ప్రధాన కార్యదర్శి కందారి చిన్నబాబు, ఉపాధ్యక్షుడు చెప్యాల బాబు, కోశాధికారి రాయిని భానుప్రసాద్, సీనియర్ నాయకులు గోవర్ధన్, గౌడ సంఘం అధ్యక్షుడు నర్సింలు గౌడ్, తాళ్ల కృష్ణగౌడ్, చిన్న కృష్ణగౌడ్, వార్డు సభ్యురాలు లక్ష్మి, గ్రామస్తులు వెంకటేశం, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.