భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్-నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని నర్సాపూర్ మండల వ్యవసాయ అధికారిణి దీపిక సూచించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని నత్తనాయిపల్లి, కాగజ్మద్దూర్ గ్రామాల్లో ఎల్-నినో ప్రభావాలు, నీటి సంరక్షణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు రైతులకు పలు సూచనలు చేశారు.
వ్యవసాయ అధికారిణి దీపిక మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకుని రైతులు పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. ఒకే రకమైన పంటలపై ఆధారపడకుండా పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే నీటి కొరత సమస్యను కొంతవరకు అధిగమించవచ్చని వివరించారు. ముఖ్యంగా వరి సాగును తగ్గించి, తక్కువ నీటి వినియోగంతో చేపట్టే జీరో ప్యాడీ సాగు విధానాన్ని ప్రోత్సహించాలని కోరారు.
రైతులు జొన్న, మొక్కజొన్న, పెసర, అలసంద, మినుము, శనగ, నువ్వులు, కుసుమ, పొద్దుతిరుగుడు, ఆవాలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడంతో పాటు సూక్ష్మ నీటిపారుదల పద్ధతులు, నీటి పొదుపు ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకుంటూ సాగు చేపట్టాలని తెలిపారు.
భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశాలను ముందుగానే అంచనా వేసి సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటలను కూడా సాగు చేయాలని అధికారులు సూచించారు. తక్కువ పెట్టుబడితో మెరుగైన ఆదాయం పొందేలా స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అలవర్చుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భారతి, ఎంపీఓ మహమ్మద్ మొజామ్ హుస్సేన్, వ్యవసాయ విస్తరణ అధికారి స్వప్న, HEO గోవింద్, AEO మోహన్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.