భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: నవంబర్ 29న కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ సభకు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చేలా సమన్వయంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే, BRS నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల సతీష్ కుమార్ సూచించారు. సభను విజయవంతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యత తీసుకుని ముందస్తు ఏర్పాట్లలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
హుస్నాబాద్ పట్టణంలోని BRS పార్టీ కార్యాలయంలో శుక్రవారం దీక్షా దివస్ సభ ఏర్పాట్లపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముందస్తు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ నిర్వహణ, జన సమీకరణ, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలపై వొడితల సతీష్ కుమార్ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సభకు హాజరయ్యేలా బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. సభకు తరలివచ్చే నాయకులు, కార్యకర్తల విషయంలో ముందస్తు సమన్వయం చేసుకోవాలని, సభ విజయవంతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.
ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.