భారత్ సమాచార్, ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఒకే ఒక్క ఉద్దేశంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి అక్కడికి పర్యటనను ప్లాన్ చేశారని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు . ప్రజల సమస్యల కంటే రాజకీయ హడావుడి సృష్టించడమే ఈ పర్యటన అసలు ఉద్దేశమని ఆయన విమర్శించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో వైద్య కళాశాలలపై జగన్, వైకాపా విమర్శలు, రాద్ధాంతంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానం, ప్రైవేటీకరణ మధ్య తేడా కూడా తెలియక అబద్ధప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైద్య విద్యలో నాణ్యత పెంచి, మరింత సౌకర్యాలను ప్రజలకు అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తీసుకొస్తున్న పీపీపీ విధానాన్ని, రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం బాధ్యతారాహిత్యమని ఆయన అన్నారు. పీపీపీ విధానంలో ఏర్పాటు కానున్న కళాశాలల్లో సీట్లు, ఫీజులు పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయని, ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ అంశమూ ఉండదన్నారు. అయినప్పటికీ జగన్ రెడ్డి ఈ నిజాలు తెలిసీ కావాలనే వైద్య కళాశాలలపై అబద్ధప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా విశాఖకు తేవలేదని గుర్తుచేసిన ఆయన, అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని విశాఖపై ఇప్పుడు చూపిస్తున్న హఠాత్తు ఆసక్తి రాజకీయ స్వార్థమేనని అన్నారు. విశాఖను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న తీరు ఓర్చుకోలేక జగన్ రెడ్డి చిచ్చు రేపాలనే కుట్రలు చేస్తున్నారని మండి పడ్డారు. అదీగాక వచ్చే నెలలో ప్రభుత్వం విశాఖపట్నంలో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు నిర్వహించబోతోందన్న జీవీ ఆ సందర్భంలో నగరాన్ని ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిలో నిలపాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని దెబ్బతీయడానికి జగన్ రెడ్డి ఇలాంటి అలజడి పర్యటనలు చేపడుతున్నారని విమర్శించారు. ప్రజల అభివృద్ధి, రాష్ట్ర ప్రగతిపై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా జగన్ చేస్తున్న ఈ రాజకీయ నాటకాల్ని ప్రజలు ఇక ఎట్టి పరిస్థితుల్లో నమ్మే అవకాశం లేదన్నారు. రోజురోజుకీ అడ్రెస్ కోల్పోతున్న వైఎస్సార్‌సీపీ గ్రాఫ్‌ను పెంచుకోవడం, క్యాడర్‌ను కాపాడుకోవడానికే జగన్ యాత్రల డ్రామాలు చేస్తున్నారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని సరైన సమయంలో కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం అన్నారు.
మరిన్ని కథనాలు:
తెలంగాణ టీడీపీకి పూర్వ వైభవం కోసం చంద్రబాబు ఫోకస్