భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, అక్టోబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

పిల్లలను బయటకు పంపితే కఠిన చర్యలు: డిప్యూటీ సీఎం భట్టి

34

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బకాయిల కోసం తరగతి గదుల నుంచి పిల్లలను బయటకు పంపితే కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.  మంగళవారం హైదరాబాద్ నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం పై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ , ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మెదక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు.డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేటు పాఠశాల యాజమాన్యులు వారి బడులలో చదివే విద్యార్థులను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయడానికి వీలు లేదని అన్నారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు ప్రభుత్వం చెల్లిస్తుందని, విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజు కట్టమని అడగటం లేదా విద్యార్థులను బయటకు పంపడం వంటి వాటికి పాల్పడితే తీవ్రంగా పరిగణించి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల నుంచి విద్యార్థులను బయటికి పంపడానికి వీలు లేదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు వెంటనే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యులతో సమావేశమై పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురి చేయకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కు ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. సామాజిక బాధ్యతగా భావించి విద్యా రంగం పై ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం క్రమ పద్ధతిలో విడుదల చేస్తుందని, బకాయిల కోసం విద్యార్థులను అవమానించినట్లు ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. తరగతి గదిలో నుంచి పిల్లలను బయటకు పంపిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ జాబితాను కలెక్టర్ల సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో జరుగుతున్న పాఠ్యాంశాల బోధన, అక్కడ ఉన్న వసతులను సైతం పరిశీలించి నివేదిక అందించాలని అన్నారు. ప్రైవేట్ స్కూల్స్ తో బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ఎంఓయూ చేసుకునే సమయంలోనే ఫీజులను దృష్టిలో ఉంచుకొని పిల్లలను ఇబ్బంది పెట్టకూడదు అనే కండిషన్ ఉంటుందని అన్నారు. పిల్లలను బయటకు పంపడం రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కును నివారించడమేనని దీనిని తీవ్రంగా పరిగణించాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ పిల్లలను అవసరమైతే మరో బెస్ట్ అవైలబుల్ స్కూలుకు వెంటనే ట్రాన్స్ ఫర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో దసరా తర్వాత పిల్లల అటెండెన్స్ గమనించాలని , పాఠశాలలు చేస్తున్న ఇబ్బందుల కారణంగా పిల్లలు వెళ్లడం లేదని అన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల పిల్లలు ధర్నా చేసే పరిస్థితి ఉందని, దీనిని కలెక్టర్లు జిల్లా విద్యాశాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ వెంటనే నివారించాలని, సంబంధిత పాఠశాల యాజమాన్యులతో చర్చించి పిల్లలకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్, ఎస్సీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి,, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.