భారత్ సమాచార్.నెట్, కర్నూలు జిల్లా : సరైన వ్యవసాయ మెలకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని మద్దికేర మండల వ్యవసాయాధికారి (ఏఓ) రవి రైతులకు సూచించారు. మంగళవారం ఆయన వ్యవసాయ సిబ్బందితో కలిసి పెరవల్లి, బసినేపల్లి గ్రామాల్లో “పొలం పిలుస్తోంది” కార్యక్రమాన్ని నిర్వహించారు. సకాలంలో సస్యరక్షణ, సరైన పోషకాలు అందించడం ద్వారానే లాభాలు ఆర్జించగలరని ఆయన ఉద్ఘాటించారు.
ఈ సందర్భంగా ఏఓ రవి మాట్లాడుతూ.. కంది, పప్పు శనగ పంటలకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు వివరించారు. ముఖ్యంగా, వేరుశనగ పంటలో జిప్సం వాడకం యొక్క ప్రాముఖ్యతను, దాని ద్వారా దిగుబడి ఎంత పెరుగుతుందో స్పష్టంగా వివరించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విఏఏ ఇంద్రజ, విహెచ్ఏ రాజశేఖర్, యంపిఈఓ మాధవిలతతో పాటు రెవెన్యూ సిబ్బంది మరియు పలువురు రైతులు పాల్గొన్నారు.