భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజాపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మరిపెడ మున్సిపాలిటీలో శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుగులోత్ రవి నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టీపీసీసీ డోర్నకల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎండీ అవేజ్తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అనేక సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, ఇంటింటికీ సన్నబియ్యం, మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళా సంఘాలకు రుణాలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, ప్రతి మండలానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రామచంద్రనాయక్ విమర్శలు చేశారు. కేసీఆర్ గెస్ట్‌హౌస్‌లో నిద్రపోతూ తన అనుచరులతో పనికిరాని ధర్నాలు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీపీసీసీ కోఆర్డినేటర్ ఎండీ అవేజ్ మాట్లాడుతూ కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుంటే ధర్నాలకు పిలుపునివ్వడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుగులోత్ రవి నాయక్ మాట్లాడుతూ ప్రజాపాలన ద్వారా ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ పథకం అందుతోందన్నారు. మిగిలిన హామీలను కూడా రాబోయే కాలంలో అమలు చేస్తామని తెలిపారు. వెయ్యి రోజులుగా అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విశారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు పాంగోత్ రాంలాల్, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.