భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన చేసిన ప్రజాసేవను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలు, రైతులు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఆయన పాలన సాగిందని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావడం, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పించడం వైఎస్సార్ పాలనలో కీలక నిర్ణయాలని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్‌తో పాటు పేదల కోసం చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలు ఆయన ప్రజా సేవకు నిదర్శనమని తెలిపారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించి సంవత్సరాలు గడుస్తున్నా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రజల కోసం చేసిన సేవలు నేటికీ ప్రజల జ్ఞాపకాల్లో నిలిచివున్నాయని కాంగ్రెస్ నాయకులు అన్నారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసిన వైఎస్సార్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్, వార్డ్ నెంబర్ ప్రీతి మహేందర్, సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్, గజం ప్రవీణ్, ఎలుక పల్లి బంజరవి, శివలింగం, గణేష్, వార్డ్ నెంబర్ అనిల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.