Homemain slidesప్రభుత్వం నుంచి కాలేజీల ఖాతాలకు...

ప్రభుత్వం నుంచి కాలేజీల ఖాతాలకు…

భారత్ సమాచార్, అమరావతి ;

కళాశాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద ప్రభుత్వం చెల్లించే ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాలకు జమ చేసే విధానం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పాత విధానంపై విధివిధానాలు రూపొందించాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ విద్యాశాఖ అధికారులను తాజాగా ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కాలేజీలకు నేరుగా ఫీజులు ఇచ్చే విధానం ఉండగా, వైసీపీ ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో జమ చేసే విధానం ప్రవేశపెట్టింది. కానీ సకాలంలో ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెచ్చేవి. దీంతో పాత విధానంలో నేరుగా కాలేజీల ఖాతాల్లోకి ఫీజులు వేయాలని, ఇందులో విద్యార్థులు, తల్లిదండ్రులకు సంబధం ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఫీజులతో పాటు ఉన్నత విద్యకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి లోకేశ్‌ సచివాలయంలో సమీక్షించారు. గత ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన పథకాల్లో రూ.3,480 కోట్లు బకాయి పెట్టడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉండిపోయాయని తెలిపారు. గత ప్రభుత్వ అనాలోచిత విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆరోపించారు.
కాలేజీల్లో డ్రగ్స్‌ నియంత్రణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్‌ అధికారుల నియామకం అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. డ్రగ్స్‌ దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛందసంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. ఉన్నత విద్యాసంస్థలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, కోర్టు కేసులు, అడ్మిషన్ల వివరాలను డ్యాష్‌ బోర్డులో పెట్టాలని ఆదేశించారు. పొట్టి శ్రీరాములు, అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీలను రాష్ట్రంలో ఏర్పాటుచేసే అంశాలపైనా చర్చించారు.

మరికొన్ని వార్తా విశేషాలు…

కన్వీనర్‌ కోటా సీట్లకు ఫీజులు ఖరారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments