భారత్ సమాచార్, పెనమలూరు;
పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ‘పల్లె పండుగ’ వారోత్సవాలను నేడు అట్టహాసంగా ప్రారంభించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కంకిపాడు మండల పరిధిలోని పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కంకిపాడు గ్రామంలో రూ.95.15 లక్షల అంచనా వ్యయంతో 11 అంతర్గత సిమెంటు రోడ్ల నిర్మాణం, రూ. 54 లక్షల అంచనా వ్యయంతో పునాదిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కాంపౌండ్ వాల్ నిర్మాణం, అదే గ్రామంలో రూ.52 లక్షల విలువైన రెండు అంతర్గత సిమెంటు రోడ్ల నిర్మాణానికి సంబంధించి శిలాఫలకాలు ప్రారంభించి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రూ.4500 కోట్ల వ్యయంతో, దాదాపు 30 వేల వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టి, 8 లక్షల మందికి ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి అవకాశం కల్పించనున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ కార్యక్రమాలను చేపట్టనుందని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.12 వేల కోట్ల ఉపాధి హామి నిధులు నిరుపయోగంగా మారిపోయాయని ఆరోపించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రూ.4,500 కోట్లతో భారీగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం చారిత్రాత్మక ఘట్టంగా నిలచిందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ప్రతి పంచాయతీ కార్యాలయంలో సిటిజెన్ నాలెడ్జ్ ఏర్పాటు చేసి పంచాయతీకి అందుతున్న నిధులు, చేపట్టిన కార్యక్రమాలు ప్రతీ ఒక్కటి ప్రజలకు తెలిసేలా, పారదర్శకంగా తెలియజేయనున్నారు. ఈ పల్లె పండుగ వారోత్సవాల్లో శ్రీకారం చుట్టే ప్రతీ ఒక్క అభివృద్ది పనులు కూడా సంక్రాంతి లోపు పూర్తయ్యేలాగా, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నియోజకవర్గంలో కలుషిత త్రాగునీరు వల్ల 43 గ్రామాలు ఇబ్బంది పడుతున్న విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే గ్రామీణ నీటి సరఫరా విభాగం నుండి ప్రత్యేక బృందాలను అక్కడ నీరు నాణ్యతను పరిశీలించేందుకు వెళ్లాలని, సమస్య పరిష్కరించేందుకు పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలసౌరి , మంత్రి కొల్లు రవీంద్ర , పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ , గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము , పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశి భూషణ్ కుమార్ , పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణ తేజ ఐఏఎస్ , కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ , ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.