Homemain slidesమేడారంలో 'బంగారం' మాఫియా

మేడారంలో ‘బంగారం’ మాఫియా

భారత్ సమాాచార్, వరంగల్ ; భక్తులకు కొంగు బంగారంగా కొలిచే సమ్మక్క సారలమ్మల మేడారం మహాజాతరలో బెల్లం అక్రమ దందా జోరందుకుంది. జాతర ముసుగులో గిరిజనేతరులు రంగ ప్రవేశం చేసి అధిక ధరలకు బెల్లం విక్రయిస్తూ భక్తుల జేబులు ఖాళీ చేస్తూ తమ గల్లాపెట్టెలు నింపుకుంటున్నారు. సమ్మక్క, సారలమ్మ తల్లులకు బంగారంగా భక్తులు సమర్పించిన బెల్లాన్ని సైతం రీసైక్లింగ్‌ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. దెబ్బతిన్న బెల్లాన్ని అక్రమమార్గంలో గుడుంబా తయారీకి తరలిస్తున్నారు. వరంగల్‌, కొత్తగూడెం, మణుగూరు, విజయవాడ నుంచి బెల్లం వ్యాపారులు మేడారంలో అడ్డావేసి ఈ అక్రమ దందాకు తెరతీశారనే ప్రచారం జరుగుతుంది.

బెల్లం మాఫియాపై అధికారుల చోద్యం:
10 కిలోల బెల్లంకు రూ.600 వసూలు చేస్తున్నారు. అంటే కిలోకు రూ.60కి విక్రయిస్తున్నారు. చిన్నబెల్లం ముక్కలను కిలో రూ.70కి అమ్ముతున్నారు. కిలోపై బయట మార్కెట్‌ కంటే జాతరలో రూ.20-రూ.30 అధికంగా వసూలు చేస్తున్నారు. మహాజాతర ముగిసే వరకు సుమారు 450 టన్నుల బెల్లాన్ని విక్రయించే అవకాశం ఉంది. కిలో రూ.70 మేరకు లెక్కేస్తే రూ.3.15 కోట్లు అవుతుంది. అధిక ధరలతో భక్తుల నుంచి రూ.1.35 కోట్లు అదనంగా దండుకునేందుకు బెల్లం మాఫియా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ దందా గురించి తెలిసిన అధికారులు ధరలను నియంత్రించకుండా చోద్యం చూస్తుండడం గమనార్హం.

రీసైక్లింగ్ దందా:
తల్లులకు మొక్కుగా పెట్టిన బెల్లాన్ని మరోసారి తీసుకెళ్లడం మహాపాపంగా భక్తులు భావిస్తారు. రీసైక్లింగ్‌ దందాకు చెక్‌ పెట్టేందుకు ఎక్సైజ్‌శాఖ అధికారులు దృష్టిసారించడంలేదనే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బయటి మార్కెట్లో కొబ్బరికాయల ధర రూ.20 నుంచి రూ.30 వరకు ఉండగా మేడారం జాతరలో రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. జాతరలో సుమారు రూ.25 లక్షల కొబ్బరికాయలు అమ్ముడవుతాయని అంచనా. ఈ లెక్కన రూ.20చొప్పున అదనంగా వసూలు చేయడం వల్ల జాతర ముగిసే వరకు సుమారు రూ.5కోట్ల భారం భక్తులపై పడనుంది. మేడారంలోనే బెల్లం, కొబ్బరికాయల మాఫియా రూ.8 కోట్లకు పైగా దండుకునేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారులు వెంటనే దృష్టిపెట్టి చర్యలు తీసుకోవాలని భక్తులు వేడుకుంటున్నారు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

జర్మనీలో ఉద్యోగం వదిలి..కరీంనగర్ లో హోటల్ పెట్టాడు

RELATED ARTICLES

Most Popular

Recent Comments