భారత్ సమాచార్, తిరుమల ;
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడు కొండల శ్రీనివాసుడి భక్తులకు టీటీడీ అధికారులు తాజాగా ఒక శుభవార్తను అందించారు. 65 ఏళ్ల వయస్సు దాటిన వృద్ధులకు శుభవార్త. సీనియర్ సిటిజన్లకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉచిత దర్శన ఏర్పాట్లు చేశారు. ఇందు కోసమే ప్రత్యేకంగా రెండు స్లాట్లను కేటాయించారు. ఒకటి ఉదయం 10 గంటలకు. మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు. ఈ ఉచిత దర్శనం కోసం ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫోటో ఐడీతో వయస్సును రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. దర్శనం కోసం వేచి ఉన్న సమయంలో టీటీడీ నుంచి వేడి సాంబార్ అన్నం, పెరుగు, అన్నం మరియు వేడి పాలు కూడా అందిస్తారు. ఆలయం గేట్ వద్ద కార్ పార్కింగ్ ప్రాంతం నుండి, కౌంటర్ వద్ద మిమ్మల్ని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు కూడా అందుబాటులో ఉంటుంది. వీరి కోసం ఏర్పాటు చేసిన స్లాట్ల సమయంలో ఇతర అన్ని క్యూలను నిలిపేస్తారు. ఎలాంటి ఒత్తిడి లేదా బలవంతం లేకుండా సీనియర్ సిటిజన్లు మాత్రమే దర్శనానికి పంపుతారు. దర్శనానికి చేరే క్యూ లైన్ లో 30 నిమిషాల్లో దర్శనం పూర్తి అయిపోతుంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోటానికి టిటిడి హెల్ప్‌డెస్క్ తిరుమలను 08772277777 నంబర్‌లో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.