భారత్ సమాచార్, అమరావతి ;
రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం రెండో సమావేశం తాజాగా అమరావతి రాష్ట్ర సచివాలయంలో జరిగింది. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, డీజీపీ ద్వారకా తిరుమల రావు పాల్గొన్నారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఏర్పాటుచేయనున్న ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ విధివిధానాలపై చర్చించారు. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పోలీసు ఉన్నత అధికారులను ఆదేశించారు. అమరావతిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు 26 జిల్లాల్లో నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఫిర్యాదుల కోసం 1908 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుచేయనున్నారు.
కఠిన చర్యలు తీసుకోకపోతే ఒక తరాన్ని నష్టపోతాం
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలి. ఇప్పుడు చేయకపోతే ఒక తరాన్ని నష్టపోతాం. గంజాయి దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేపట్టాలి. గంజాయి సాగును అరికట్టడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న గంజాయి విషయంలో ఆయా ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానానికి ఏఐ అనుసంధానించి మెరుగైన ఫలితాలు రాబట్టాలి. విజిబుల్ పోలిసింగ్ తో పాటు ఇన్ విజిబుల్ పోలిసింగ్ పైనా దృష్టి సారించాలి. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న బెస్ట్ ప్రాక్టిసెస్ పై అధ్యయనం చేయాలి. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు మహిళా పోలీసుల సేవలను కూడా వినియోగించుకోవాలన్నారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు అవగాహన కలిగించేలా వీడియోల ప్రదర్శనకు చర్యలు చేపడతామన్నారు. యువగళం పాదయాత్రలో గంజాయి వల్ల ప్రజలు పడుతున్న బాధలు స్వయంగా చూశానని, మంగళగిరిలోనూ గంజాయి సరఫరాపై మహిళలు పెద్దఎత్తున ఫిర్యాదులు చేశారన్నారు. గంజాయి, డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు సెలబ్రిటీలను భాగస్వామ్యం చేస్తామన్నారు.