భారత్ సమాాచార్, హైదరాబాద్: భారీ వర్షాలతో హైదరాబాద్ బెంబేలెత్తుతోంది. అతలాకుతలమౌతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. భారీ వర్షాల ధాటికి అమీర్పేట్, బేగంపేట్, షేక్పేట్, టోలీచౌకీ, గచ్చిబౌలి, కొండాపూర్, అత్తాపూర్ వంటి ప్రాంతాల్లోని లోతట్టు ప్రదేశాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. మురుగునీరు, వరదనీటి పారుదల కాలువల్లో చెత్త పేరుకుపోవడం వల్ల అవన్నీ కూడా పొంగిపొర్లుతున్నాయి.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆమ్రపాలి.. నగరవాసులకు పలు సూచనలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించడం, రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు- అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని కోరారు. రోడ్లపై నిలిచిన వర్షపునీటిలో పిల్లలు, వృద్దులు ఒంటరిగా బయటికి వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనాలను కూడా వినియోగించవద్దని సూచించారు. వర్షపు నీరు వెళ్లిపోవాలనే ఉద్దేశంతో స్థానికులు తమ పరిధిలో ఉన్న మ్యాన్ హోల్స్ను తెరవకూడని అన్నారు. ఒకవేళ అవి తెరచి ఉంటే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు తెలియజేయాలని ఆమ్రపాలి విజ్ఞప్తి చేశారు.
ఈ పరిస్థితుల మధ్య హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. షేక్పేట్, టోలీచౌకీల్లో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో కలియదిరిగారు. విధి నిర్వహణలో నిమగ్నమైన సిబ్బందితో మాట్లాడారు. వర్షపునీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఇతర విపత్తు నిర్వహణ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వరద పరిస్థితులను ఎదుర్కొంటోన్నాయని, నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటున్నామని అన్నారు.