భారత్ సమాచార్, క్రీడలు : ఇప్పుడు ఏ సెలబ్రిటీల నోట విన్నాకూడా డీప్ ఫేక్, ఏఐ సాంకేతికతో తరచుగా బాధపడుతున్నామనే చెపుతుంటారు. సాంకేతిక సాయంతో సెలబ్రిటీల ఫొటోలు, వీడియాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో పెడుతూ ట్రోల్ చేస్తున్నారు, వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తమకు గిట్టనివారిని, అలాగే ఆడవాళ్ల ఫొటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇటీవల రష్మిక ఫొటోను అశ్లీల ఫొటోకు డీప్ ఫేక్ చేసి సాంకేతికత సాయంతో సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. దీనిపై ప్రధాని మోదీ, ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రభుత్వం తాజాగా డీప్ ఫేక్, ఏఐ..వంటి సాంకేతికతలపై చట్టం చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. డీప్ ఫేక్ సాయంతో పెద్ద ఎత్తున అసత్య ప్రచారాలకు తెర తీసే అవకాశం ఉన్నట్టు సాంకేతిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డీప్ ఫేక్ సాంకేతికత దుర్వినియోగంతో ఇబ్బంది పడ్డ వారిలో తాజాగా సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ కూడా చేరింది. సారా తను ఇబ్బంది పడ్డ అనుభవాలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తన డీప్ ఫేక్ ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయినట్టు వాపోయింది. ఎక్స్ (ట్విటర్)లో తన పేరుతో కొంత మంది నకిలీ ఖాతాలు తెరిచారని వెల్లడించింది. వీటిని నమ్మదని నెటిజన్లను కోరింది.
క్రికెటర్ శుభమన్ గిల్ తో సారా టెండూల్కర్ కలిసి ఉన్నట్లు ఓ మార్ఫింగ్ ఫొటో నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. సారా తన సోదరుడు అర్జున్ టెండూల్కర్ తో ఉన్న ఫొటోను కొందరు ఆకతాయిలు డీప్ ఫేక్ చేసి.. అర్జున్ ఫేస్ స్థానంలో శుభమన్ గిల్ ఫొటో పెట్టినట్టు తెలుస్తోంది. ఇవే కాదు శుభమన్ గిల్ , సారా డేటింగ్ లో ఉన్నట్టు.. ఏదో హోటల్ లో కలిసి ఉన్నారనే విధంగా ఫొటోలు మార్ఫింగ్ చేసి పెడుతుండడంపై సారా ఆవేదన వ్యక్తం చేసింది.