భారత్ సమాాచార్.నెట్: జమ్ముకశ్మీర్‌లోని (Jammu&Kashmir) పహల్గాంలో (Pahalgam) పర్యటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని (Terror attack) తీవ్రంగా ఖండించిన భారత్ (India).. ఉగ్రదాడికి ప్రతీకారంగా దాయాది పాకిస్తాన్‌పై భారత్ దౌత్యపరమైన చర్యలు మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే దేశంలోకి పాకిస్థానీయులకు ప్రవేశంపై నిషేధం విధించడంతో పాటు సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన కేంద్రం.. తాజాగా ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.
పాకిస్తాన్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్‌కు బుధవారం అర్ధరాత్రి తర్వాత సమన్లు పంపింది. ఆయనను పిలిపించి పాక్ మిలిటరీ దౌత్యవేత్తలకు ‘పర్సోనా నాన్ గ్రాటా’ అధికారిక నోటీసు అందించింది. అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనేందుకు ఈ నోటీసులు జారీ చేస్తారు. దీనిప్రకారం వారు వారం రోజుల్లోగా భారత్‌ను వీడాల్సి ఉంటుంది. ఈ మేరకు విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు, పహల్గాంలో నరమేధానికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తులను కూడా బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్థాన్‌ను గట్టిగా భారత్ హెచ్చరించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకూ ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం దిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సరిహద్దుల్లో భద్రతా దళాలను అప్రమత్తం చేసింది.
పాక్ పౌరులు, పర్యటకులు ఎవరైనా భారత్‌లో ఉంటే వారం రోజుల్లో వారి దేశానికి వెళ్లాలని.. అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను వెంటనే నిలిపివేస్తున్నట్లుగా కేంద్రం తెలిపింది. అలాగే 1960నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిరవధికంగా నిలిపివేయడం ఒకటి. ఈ ఒప్పందం ప్రకారం సింధు, దాని ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల జలాలను ఇరుదేశాలు పంచుకుంటున్నాయి. పాకిస్థాన్‌లోని కోట్ల మంది ప్రజలకు ఈ నదులే ప్రధాన నీటి వనరు. సార్క్ వీసా మినహాయింపు పథకం (ఎస్.వీ.ఈ.ఎస్.) కింద పాకిస్థానీయులకు వీసాలు నిలిపివేశారు. ప్రస్తుతం ఆ వీసాపై భారత్‌లో ఉన్న పాక్ జాతీయులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు.