భారత్ సమాచార్.నెట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 18వ సీజన్ తాత్కాలికంగా వాయిదా (Postponed) పడింది. భారత్, పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. ఈ మేరకు బీసీసీఐ (BCCI) అధికారిక ప్రకటన విడుదల చేసింది. వేదిక, తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడిస్తామని బీసీసీఐ పేర్కొంది. యుద్ధ పరిస్థితుల్లో లీగ్ నిర్వహించలేమని బీసీసీఐ తేల్చి చెప్పింది.
ఐపీఎల్ మ్యాచ్‌లు వారం రోజుల పాటు బీసీసీఐ నిలిపివేసింది. ధర్మశాల వేదికగా పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ మధ్యలోనే రద్దయిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌ను బ్లాక్ అవుట్ ప్రకటించడంతో అత్యవసరంగా రద్దు చేశారు. తొలుత ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్‌ను రద్దు చేసినట్లు ప్రకటించిన ఐపీఎల్ వర్గాలు.. ఆ తర్వాత అసలు విషయాన్ని వెల్లడించాయి. భద్రతా కారణాల వల్ల ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ రద్దు చేసినట్లు ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమాల్ తెలిపారు.
ఈరోజు జరగాల్సిన లఖ్‌నవూ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య లఖ్‌నవూలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ కూడా నిలిపివేసింది. ప్రస్తుతం ఈ సీజన్‌లో ఇంకా 12 లీగ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అలాగే, రెండు క్వాలిఫయర్ మ్యాచ్‌లు, ఒక ఎలిమినేటర్, ఒక ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం మే 25న కోల్‌కతాలో ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. ఇక పాయింట్ల పట్టికలో ప్రస్తుతం గుజరాత్, బెంగళూరు జట్లు చెరో 16 పాయింట్లతో అగ్రస్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ జట్టు 15 పాయింట్లు, ముంబై జట్టు 14 పాయింట్లతో వారిని అనుసరిస్తున్నాయి.