భారత్ సమాచార్, అమరావతి;
ఎంప్లాయిమెంట్ ఫస్ట్ ( ఉద్యోగ కల్పన ప్రధమ లక్ష్యం) అనేదే ప్రభుత్వ విధానమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పారిశ్రామిక వేత్తలను, పెట్టుబడుదారులను ఆకర్షించి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మార్గం సుగమం చేసేలా నూతన పాలసీలు ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలపై నేడు అమరావతి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు టీ జీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎక్కువ ఉద్యోగాలిచ్చే కంపెనీలకు 10 శాతం అదనపు ప్రోత్సాహకం అందించేలా నిబంధనలు రూపొందించాలని ఉన్నతాధికారులకు సూచించారు. స్కిల్స్ డెవలప్మెంట్,ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఫెసిలిటేషన్ కేంద్రంగా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో అనుబంధ హబ్ లు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. రాష్ట్ర యువతకు ఉద్యోగ కల్పనకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.